Wednesday, 3 August 2011

ఆజాద్ భేటీలు అంతా డ్రామా

చర్చల ముసుగులో కాలయాపన: కేకే


తెలంగాణ ఏర్పాటును మరింత జాప్యం చేయటానికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులామ్ నబీ ఆజాద్ చర్చల ముసుగులో డ్రామా ఆడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె కేశవరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయనతో జరుపుతున్న చర్చల వల్ల ఫలితం ఉండదని తెలిసినప్పటికీ, ఆయనపై ఉన్న గౌరవం కొద్దీ హాజరవుతున్నామని కేశవరావు విలేకరులకు చెప్పారు. ఈ విషయాన్ని తాను ఆజాద్‌కు తెగేసి చెప్పానన్నారు. ఫలితం ఉండదని తెలిసినా చర్చలకు వెళ్లటంలో ఉన్న మతలబేమిటి? అని ప్రశ్నించగా, ఈ విషయంలో తమకు ఎవరి సలహాలు అవసరం లేదన్నారు. తెలంగాణ గురించి గత రెండేళ్లుగా తాము గొంతెత్తి అరిచినా ఫలితం లేకపోయిందని, తెలంగాణ వస్తుందన్న నమ్మకం లేనందునే పదవులకు రాజీనామా చేశామని కెకె చెప్పారు. రాజీనామాల ఉపసంహరణ, తెలంగాణ సాధనలో రాజీ పడేది లేదు. అయితే పార్లమెంటులో అత్యంత కీలక అంశంపై ఓటింగ్ జరిగినప్పుడు ప్రభుత్వాన్ని పరిరక్షించాల్సిన అవసరం వస్తే కాంగ్రెస్‌వాదిగా ప్రభుత్వాన్ని సమర్ధిస్తామని చెప్పారు. ఆగస్టు 6లోగా ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామా చేసి తీరాలని రాజకీయ జెఎసి ఇచ్చిన అల్టిమేటమ్‌ను ఖాతరు చేయబోనని కేశవరావు నిష్కర్షగా చెప్పారు. కాంగ్రెస్‌వాదిగా తన అంతరాత్మ ప్రబోధం మేరకే నిర్ణయం తీసుకుంటానన్నారు. 14ఎఫ్ ఉపసంహరణకు సంబంధించి తిరిగి విధానసభ నుంచి తీర్మానం అందాల్సిన అవసరం ఉందని హోంమంత్రి చిదంబరం చేసిన ప్రకటనపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోసారి తీర్మానాన్ని పంపాల్సిన అవసరంపై చిదంబరం పూర్తి వివరణ ఇవ్వాలని కెకె డిమాండ్ చేశారు. విధానసభ ఒకసారి 14ఎఫ్‌ను రద్దుచేయాలని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించినందున, రెండోసారి తీర్మానం చేయాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ప్రకటించడాన్ని ఆయన అభినందించారు. అయితే ముఖ్యమంత్రి కిరణ్ వీలు చూసుకుని ఢిల్లీకి వచ్చి ఈ విషయమై హోంమంత్రితో సంప్రదిస్తే బాగుంటుందని అభిప్రాయ పడ్డారు. హోంమంత్రి చేసిన ప్రకటనను అమలు చేసితీరాలా? వద్దా? అనే విషయంపై అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా న్యాయశాఖకు లేఖ రాస్తానని కెకె చెప్పారు. ఎస్‌ఐ పరీక్షలు ప్రారంభం కాకముందే ఈ విషయమై తుది నిర్ణయం వెలువడాలని ఆయన కోరారు. తెలంగాణ ఏర్పాటే తమ జీవితాశయమని చెబుతూ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డితో వ్యక్తిగతంగా తనకు ఎటువంటి అభిప్రాయభేదాలు లేవని కేశవరావు స్పష్టం చేశారు

0 comments:

Post a Comment