కాంగ్రెస్ నాయకుడికంటే తెలంగాణవాదిగానే ఆయన ముద్రపడ్డారు! ఇదీ పొన్నం ప్రభాకర్‌ను ఉద్దేశించి ఓ ప్రధానోపాధ్యాయుడు చేసిన వాఖ్య! తెలంగాణ ఉద్యమంలో పొన్నం ప్రభాకర్ క్రియాశీలత ఎంత? అన్న ప్రశ్నకు సమాధానంగా నిలిచే వ్యాఖ్య ఇది! చిన్న వయసులోనే అత్యున్నత చట్టసభ అయిన లోక్‌సభకు ఎన్నికయ్యారు పొన్నం ప్రభాకర్. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో అత్యంత పిన్న వయస్కుడైన ఎంపీగా నిలిచారు. కరీంనగర్ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న పొన్నం ప్రభాకర్.. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూనే తెలంగాణవాదాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. విద్యార్థి ఉద్యమాల నుంచి ఎదిగిన పొన్నం.. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుడిగా పోరుబాటలో సాగుతున్నారు. ఉద్యమం కోసం పార్టీ ఎంపీల ఫోరం కన్వీనర్ పదవినేగాక.. ఎంపీ పదవిని సైతం త్యజించారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు సాగిస్తున్న ఉద్యమంలో దూసుకు పోతున్న యువనేత ఆయన. పదవులను సైతం లెక్క చేయకుండా ప్రజల ఆకాంక్షలు, కోరికల మేరకు ఉద్యమబాట పట్టిన ఆ యువనేత ప్రజావూపతినిధిగా కూడా ప్రజల మన్ననలు పొంది తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. తొలిసారి ఎంపీగా గెలిచి ఏకంగా అధికార పార్టీ రాష్ట్ర ఎంపీల ఫోరం కన్వీనర్ బాధ్యతలు చేపట్టి ప్రతిభను చాటుకున్నారు. సీమాంధ్ర నేత లగడపాటి రాజగోపాల్ సవాలుకు జవాబుగా తెలంగాణ రాష్ట్రమే ముఖ్యంతప్ప పదవి కాదంటూ క్షణంలో ఆ పదవి వదులుకున్నారు. 158 రోజులు లోక్‌సభ నడిస్తే 155 రోజులు హాజరై రాష్ట్ర నేతల తరఫున రికార్డు సృష్టించారు. లోక్‌సభలో తన నియోజకవర్గం, రాష్ట్రానికి సంబంధించి 522 ప్రశ్నలు వేసి అత్యధికంగా ప్రశ్నలు వేసిన ఎంపీల్లో ఆంధ్రవూపదేశ్ నుంచి రెండవ, జాతీయ స్థాయిలో తొమ్మిదవ స్థానంలో నిలిచారు. నియోజకవర్గం ప్రజలకు ఎక్కువ కాలం అందుబాటులో ఉంటూ వారి అవసరాలు తీర్చే ప్రయత్నం చేశారు. రాష్ట్ర మార్క్‌ఫెడ్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత రూ. 250 కోట్లు ఉన్న ఆ సంస్థ టర్నోవర్‌ను రూ. 1400 కోట్లకు తీసుకెళ్ళి తన సత్తా చాటుకున్నారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ అన్ని విశ్వవిద్యాలయాలు తిరిగి సంస్థ బలోపేతానికి ఎనలేని కృషి చేశారు. ఆ పనితీరు గమనించే ఏమో కాంగ్రెస్ పార్టీ ఆయనకు మార్క్‌ఫెడ్ ఛైర్మన్ పదవిని కట్టబెట్టింది. ఆ తరువాత ఎంపీ టికెటిచ్చింది. 1987లో కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కాలేజ్ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆ తరువాత ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1999-2002 మధ్య ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా, 2005లో ఏపీ మార్క్‌ఫెడ్ ఛైర్మన్‌గా పనిచేసి 2009లో తొలిసారిగా కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల ఫోరం కన్వీనర్‌గా పనిచేశారు. ఆయనే పొన్నం ప్రభాకర్. ప్రస్తుతం తెలంగాణ ఉద్యమబాట పట్టి టీ కాంగ్రెస్ ప్రజావూపతినిధుల స్టీరింగ్ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నరు.
